ఎప్పుడాగిపోతాయో తెలియదు.. ఎక్కడాగిపోతాయో అంతు బట్టదు. ప్రయాణికులు గమ్యానికి చేరతారో లేదో అంతుబట్టదు. ఆర్టీసీలో ఆలాంటి డొక్కు బస్సులను పక్కన పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాలం చెల్లిన బస్సులకు మోక్షం లభించనుంది. సంస్థపై ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. ఇటీవల మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాల్లో రూ.వెయ్యి కోట్ల రుణసాయంతో ఆర్టీసీ ఆర్థిక పరిపుష్టిని పెంచుకోవడానికి వీలవుతుందని కార్మిక సంఘాలు, అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రత్యేకించి ఆ నిధులను కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడంతో సంస్థ మనుగడ మెరుగుపడుతుంది.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్టీసీ నార్ట్ ఈస్ట్ కోస్ట్ రీజియిన్ పరిధిలోని తొమ్మిది డిపోల్లో కాలం చెల్లిన బస్సులు 100 వరకు ఉన్నాయి. మోటారు చట్ట నిబంధనల మేరకు ప్రయాణికుల రవాణా భారీ వాహనాలకు జీవిత ప్రయాణ పరిమితులుంటాయి. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసుల బస్సుల జీవితకాలం 8 లక్షల కిలోమీటర్ల ప్రయాణం మాత్రమే. ఇంకా సామర్థ్యం ఉంటే పాసింజర్ బస్సు సర్వీసులుగా నడపవచ్చు. కానీ పాసింజర్ సర్వీసులకు 12 లక్షల కిలోమీటర్ల దూరంగా నిర్ధేశించారు. ఆ పరిధి దాటితే రోడ్డు మీద అవి తిరగడానికి వీల్లేదు. అంతవరకు 8 లక్షల కిలోమీటర్లు తిరిగిన ఎక్స్‌ప్రెస్‌లను పాసింజర్ సర్వీసులుగా తిప్పుతారు. తరువాత 12 కిలోమీటర్లు తిప్పాక కాలం చెల్లిన బస్సులుగా మూలకు చేర్చుతారు
తాజాగా నెక్ పరిధిలో మొత్తం 789 బస్సుల్లో ఒక్కొక్క డిపోల్లో 8 నుంచి 10 బస్సులను పూర్తి స్థాయిలో సామర్థ్యం లేనివిగా గుర్తించి వాటిని రోడ్డుపైకి పంపుతున్నారు. వాటిలో అధిక శాతం ఎక్స్‌ప్రెస్ సర్వీసులున్నట్టు వివేదికలు చెబుతున్నాయి. ఇటీవల విఖాఖ నుంచి విజయనగరం వస్తున్న ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్ రఘు ఇంజనీరింగ్ కాలేజీ జంక్షన్‌లో ఆగిపోయింది. విశాఖ – విజయనగరం మధ్య జాతీయ రహదారిపై వారానికి కనీసం నాలుగు బస్సులైనా బ్రేక్‌డౌన్ అవుతూ దర్శనమిస్తాయి. రెండురోజుల క్రితం విజయనగరం నుంచి జామి మీదుగా వెళ్లే రూట్లో పల్లెవెలుగు బస్సు నిలిచిపోయింది.