ఉగాదికి ఉషస్సు

ఏళ్ల తరబడి ఒక్కో ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు.. ముగ్గురు ఇంట్లో ఉంటే నలుగురు బయట ఉండాలి. నలుగురి కడుపు నిండితే ఇద్దరు పస్తులుండాలి. గత ఐదేళ్లుగా ఇదీ నిరుపేదల జీవన చిత్రం. ఎక్కడైనా కాస్త జాగా ఇస్తే చిన్న గుడిసె వేసుకుని బతుకుతామంటూ కనిపించిన ప్రతి ప్రజాప్రతినిధినీ వేడుకున్నారు. మీరైనా కనికరించండయ్యా అంటూ అధికారులకు చేతులెత్తి దండాలు పెట్టారు. పట్టించుకున్న దిక్కులేదు. రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక నోరెత్తి అడగాల్సిన పని లేదు.. ఎందుకంటే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి బాధలను కళ్లారా చూశారు. మనసుతో విన్నారు. అందుకే ఉగాది పర్వదినాన ప్రతి పేద వానికీ నివేశన స్థలం ఇచ్చేందుకు నిర్ణయించారు. జిల్లాలో ఇప్పటికే 1.35 లక్షల మంది నివేశన స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అర్హులను గుర్తించి ఉగాదినాటికి బడుగుల జీవితాల్లో ఉషస్సు నింపేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.


అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జిల్లాలో గ్రామీణ, నగర, పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమానికి నిరుపేద మహిళలు తరలిరావటంతో దరఖాస్తులు తీసుకొనేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరిగి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వాటిని తహసీల్దార్లు పరిశీలించి అర్హుల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 75 వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. పట్టణ ప్రాంతాల్లో 60 వేల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఇంటి స్థలాల అర్హుల జాబితాలో మార్పులు, చేర్పులకు సంబంధించి వివరాలు తీసుకుంటున్నారు. అనంతరం అర్హుల తుది జాబితాలను వెల్లడించనున్నారు.